టీవీ 5 తాతాజీ కుటుంబానికి రూ 10 లక్షల సాయం

అమరావతి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాజమండ్రి టీవీ 5 రిపోర్టర్ తాతాజీ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య హామీ ఇచ్చారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయనను వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వేర్వేరుగా కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయుడబ్ల్యూజే) నాయకత్వంలో ఒక బృందం, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ.) తరపున మరో బృందం మంత్రిని కలిసి వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ప్రీమియం చెల్లింపునకు గడువు పెంచడం పట్ల ధన్యవాదాలు తెలిపాయి. ఇదే సందర్భంలో తాతాజీ విషయాన్ని కూడా జర్నలిస్టులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన ఆయన 10 లక్షల రూపాయల పరిహారాన్ని ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

మంత్రిని కలిసిన వారిలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్, ఎన్ఎ.ఆర్ఎ. జాతీయ అధ్యక్షుడు బండి సురేందర్‌ బాబు తదితరులు ఉన్నారు. ప్రమాద బీమా పథకం రెన్యూవల్ కానందున తాతాజీ కుటుంబానికి ఎదురైన సమస్యను జర్నలిస్టులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని కోరడంతో సానుకూలంగా స్పందించిన మంత్రి నాని వెంటనే ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి తాతాజీ కుటుంబానికి రూ 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని వీలైనంత త్వరగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రమాద బీమా పథకాన్ని కూడా అమలులోకి తీసుకురావటం జరుగుతోందని తెలిపారు. మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబానికి ఇచ్చే పెన్షన్‌ని రూ. 1000 నుండి రూ. 5 వేలకు పెంచటం జరుగుతుందని స్పష్టం చేశారు.

బుధవారం సీఎం జగన్‌ను కలసి జర్నలిస్టుల సంక్షేమ నిధికి కొంత మొత్తాన్ని కేటాయించమని కోరతానని, తద్వారా త్వరలోనే పెన్షన్‌ని రూ. 5 వేలుకు పెంచటం జరుగుతుందని మంత్రి తెలిపారు. సంఘాల కోరిన మీదట హెల్త్ కార్డుల ప్రీమియం చెల్లింపు, రెన్యూవల్ గడువు తేదీలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశామని మంత్రి నాని చెప్పారు.

మరోవైపు, తాతాజీకి ఏడేళ్ళ బాబు ఉన్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారి సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. ఆ బాబుకి పదో తరగతి వరకూ ఉచితంగా విద్యఅందించేందుకు శ్రీగౌతమీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ముందుకువచ్చింది. ప్రస్తుతం అందులోనే బాబు చదువుతున్నాడు. జిల్లాకు చెందిన పలువురు జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు శ్రీగౌతమీ స్కూల్ అధినేత సుంకర రవికుమార్ సృహృదయంతో, మానవతా దృక్ఫధంతో పదో తరగతి వరకూ ఉచిత విద్యను అందించేందుకు ముందుకు వచ్చారు. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో జర్నలిస్టుల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తాతాజీ భార్య హేమలతకు గ్రామ సచివాలయంలో ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారు. ఈ సాయం నిజంగా తాతాజీ కుటుంబానికి పెద్ద భరోసాగానే భావించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *